స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు అందుకున్న 68 మంది అవార్డు గ్రహీతలకు అభినందనలు
NANDYAL Oct 02 :- పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లాలో స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పరిశుభ్రత తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వివిధ కేటగిరీలకు చెందిన 68 మంది అవార్డు గ్రహీతలకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రదానం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యతగా భావించకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయడం వల్ల పరిసరాల పరిశుభ్రత దెబ్బతినడంతో పాటు ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయడం, తడి-పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ ప్రజల సహకారం లేకుండా సంపూర్ణ స్వచ్ఛత సాధ్యం కాదన్నారు. చెత్త సేకరణ, తరలింపు, పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రజలు అధికంగా సందర్శించే ప్రాంతాల్లో పరిశుభ్రత, నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. మన సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూనే పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పరిశుభ్రత విషయంలో ఇప్పటికే సాధించిన ప్రగతిని నిలబెట్టుకోవడంతో పాటు మరింత మెరుగైన ప్రమాణాలను సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత, పారిశుద్ధ్యం రంగాల్లో విశిష్ట సేవలు అందించి అవార్డులు అందుకున్న 68 మంది గ్రహీతలను అభినందిస్తూ.. వారి సేవలు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే పరిశుభ్రమైన నంద్యాల జిల్లాను నిర్మించగలమని వారు పేర్కొన్నారు.

స్వచ్ఛత సామాజిక బాధ్యతగా మారాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
స్వచ్ఛత అనేది కేవలం ఒక కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతగా, సామాజిక ఉద్యమంగా మారినప్పుడే పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించగలమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని, ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా పరిపుష్టిగా జీవించాలన్నదే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. పారిశుధ్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని, ఉత్తమ ఆచరణలను అమలు చేస్తున్న సంస్థలను, నూతన ఆలోచనలను ఆచరణలో పెడుతున్న వారిని ప్రోత్సహించేందుకు గాంధీజీ జయంతి రోజున స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

మాటల్లో కాకుండా చేతల్లో స్వచ్ఛతను చూపాలి
స్వచ్ఛత గురించి మాట్లాడటం సులభమే అయినప్పటికీ, దానిని నిత్య జీవితంలో ఆచరించడం ముఖ్యమని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన పరిసరాలు కావాలంటే మన ఆలోచనలు, అలవాట్లు, చర్యలు కూడా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం గ్రీన్ అంబాసిడర్లు, పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. వారికి అవసరమైన గ్లౌజులు, బూట్లు, క్యాప్‌లు, ఏప్రాన్లు వంటి రక్షణ పరికరాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది కూడా సమాజం ఆలోచించాల్సిన బాధ్యత ఉందన్నారు. పారిశుధ్య కార్మికులను గౌరవంగా పలకరించడం ద్వారా వారి సేవలకు తగిన గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

‘మనది’ అనే భావనతో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి
రోడ్లు, డ్రెయిన్లు, పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రభుత్వ ఆస్తులు ప్రజల పన్నుల సొమ్ముతో నిర్మించినవేనని కలెక్టర్ తెలిపారు. “ఇది ప్రభుత్వ ఆస్తి కాదు.. మన ఆస్తి” అనే భావన ప్రతి ఒక్కరిలో ఏర్పడినప్పుడే స్వచ్ఛత, సంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని ప్రశ్నించే సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. చెత్త పేరుకుపోవడం వల్ల ఈగలు, దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని, ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కార్యాలయాలు, ఇళ్లు, వాణిజ్య సంస్థల్లో వినియోగించిన టీ కప్పులు, ప్లేట్లు తదితర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లలోనే వేయాలని కోరారు.

పర్యాటక ప్రాంతాలకు ‘స్వచ్ఛ పథం’ అవసరం
శ్రీశైలం, మహానంది, యాగంటి, అహోబిలం వంటి ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారని కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ఇరువైపులా చెత్త కుప్పలు లేకుండా పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రత్యేకంగా శ్రీశైలం, పాతాళగంగ వంటి పవిత్ర జలాశయాల్లో చెత్త వేయడం, సబ్బులు, షాంపూలు ఉపయోగించడం ద్వారా నీటిని కలుషితం చేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. నీటి వనరుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హెచ్చరికలు, సందేశాత్మక బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నదులు, చెరువులు, ఇతర జల వనరులను పరిశుభ్రంగా ఉంచడం భవిష్యత్ తరాలకు మనం అందించే అత్యంత విలువైన బాధ్యత అని పేర్కొన్నారు

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
ప్లాస్టిక్ రహిత నంద్యాల సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంతో పాటు జంతువుల ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పేపర్ కవర్లు, జనపనార (జూట్) సంచులు, మొక్కజొన్న పీచుతో తయారు చేసిన పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కోరారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నుంచి ఆహారం తీసుకువెళ్లేటప్పుడు సొంత క్యారియర్లను వినియోగించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.

వ్యర్థాల నిర్వహణకు వినూత్న చర్యలు
నంద్యాలలో మార్కెట్లు, వాణిజ్య ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఉత్పత్తయ్యే వ్యర్థాల నిర్వహణకు రూ.17 లక్షల వ్యయంతో బయో డైజెస్టర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రోజుకు సుమారు 1,000 కిలోల వ్యర్థాలను ప్రాసెస్ చేసి ఎరువుగా మార్చే ఈ విధానాన్ని వ్యవసాయ భూములు, కిచెన్ గార్డెన్లకు ఉపయోగించుకోవచ్చని వివరించారు. ఇళ్ల నుంచి ప్లాస్టిక్, వేస్ట్ సీసాలు, పాత వస్తువులు తదితర వ్యర్థాలను సేకరించేందుకు ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇంటి స్థాయిలోనే వ్యర్థాలను వేరు చేసి నిర్వహించడం, కంపోస్ట్ తయారు చేయడం, ఇంకుడు గుంతలు, కంపోస్ట్ పిట్స్ ఏర్పాటు చేయడం వంటి ఉత్తమ పద్ధతులను అవలంబిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు అవార్డులు అందజేస్తున్నట్లు చెప్పారు. గృహ వ్యర్థాల నుంచి కంపోస్ట్ తయారీ, సోక్ పిట్స్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సుమారు రూ.6 వేల వరకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

33 శాతం అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలి
నంద్యాల జిల్లాలో సుమారు 33 శాతం అటవీ ప్రాంతం ఉండటం ఎంతో విశేషమని, ఈ హరిత సంపదను పరిరక్షిస్తూ జిల్లాలో గ్రీన్ కవరేజ్‌ను మరింత పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. పారిశుధ్య కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, ప్రజలు చేస్తున్న సేవలను అభినందించారు. చెరువుల ప్రక్షాళన, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో మరిన్ని సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు.

ప్రజారోగ్య పరిరక్షణలో వ్యక్తిగత బాధ్యత కీలకం
నంద్యాల బస్‌స్టేషన్‌కు ప్రతిరోజూ సుమారు 20 వేల మంది రాకపోకలు సాగిస్తారని, ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో మరుగుదొడ్లు, పారిశుధ్య వసతుల నిర్వహణ సవాలుతో కూడుకున్నదని కలెక్టర్ తెలిపారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా మరుగుదొడ్లను పరిశుభ్రంగా వినియోగించాలని, చెత్తను నిర్దేశిత డస్ట్బిన్లలోనే వేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. బయట లభించే వేయించిన ఆహార పదార్థాలు, నూడుల్స్, పానీపూరీ వంటి ఆహార పదార్థాల తయారీలో నూనెను పదేపదే వినియోగించడం ఆరోగ్యానికి హానికరమని, ఆహార భద్రత, పరిశుభ్రతపై ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.

స్వచ్ఛతే ఆరోగ్యానికి పునాది
స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం పరస్పరం అనుసంధానమై ఉన్నాయని కలెక్టర్ రాజకుమారి అన్నారు. “స్వచ్ఛమైన నంద్యాల – ఆరోగ్యకరమైన నంద్యాల” లక్ష్య సాధనకు అధికారులు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం, మన పట్టణం పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను మనమే స్వీకరించినప్పుడే స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోయ కార్పోరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ డి. శేషన్న, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Arattai