జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలి : APUWJ అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు హెచ్చరిక
VIJAYAWADA Oct 02:- వర్కింగ్ జర్నలిస్టుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం చేయాలని, వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్ డిమాండ్ చేశారు.గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా కోర్కెలదినం పాటించాలన్న ఐ.జే.యు. పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో జర్నలిస్టులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొత్త వంతెన సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జర్నలిస్టుల కోర్కెలు పరిష్కారం చేయాలని కోరుతూ వివిధ డిమాండ్లపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐ.జే.యు. సెక్రెటరీ జనరల్ డి సోమసుందర్ మాట్లాడుతూ దేశంలో మీడియా స్థితిగతులపై అధ్యయనం చేయడం కోసం మీడియా కమిషన్ నియమించాలని, జర్నలిస్టుల, మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలని, వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని, జర్నలిస్టుల వేతన సవరణ కోసం వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఎన్నికల ముందు జర్నలిస్టులకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడం విచారకరమని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి గృహనిర్మాణం చేపడతామని కూటమి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారనీ, ఇంతవరకు ఈ అంశంపై కదలిక లేదని అన్నారు. జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికి ఒక త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనీ సుబ్బారావు డిమాండ్ చేశారు. దేశంలో 15 రాష్ట్రాల్లో రిటైరైన జర్నలిస్టులకు పింఛను ఇస్తున్నారనీ ,రాష్ట్రంలో కూడా సీనియర్ పాత్రికేయులకు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తమ న్యాయమైన కోర్కెలు పరిష్కారం చేయని పక్షంలో దశలవారీ ఉద్యమాన్ని చేపడతామని, అవసరమైతే చలో అమరావతి పిలుపు ఇస్తామని సుబ్బారావు స్పష్టం చేశారు.
అమరావతి జర్నలిస్టుల ఇళ్ళస్థలాల సమస్య పరిష్కారం చేయాలని, రైల్వేలో జర్నలిస్టులకు రాయితీ ప్రయాణ సదుపాయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.అనంతరం నాయకత్వ బృందం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందచేశారు.కార్యక్రమంలో ఏ.పి.యు.డబ్ల్యు.జే. ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, విజయవాడ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు,ఐజేయూ కార్యవర్గ సభ్యులు కూన అజయ్ బాబు, ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. విజయ భాస్కర్, అమరావతి హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల నాగ శ్రీనివాసరావు, హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనాథ్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి డి.నాగరాజు,ఐజేయూ సభ్యులు షేక్ బాబు, రాధా కృష్ణ, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు జీ. రఘురామ్, యూనియన్ నేతలు మురళీ కృష్ణ, శివ రామక్రిష్ణ, బి. వీ. శ్రీనివాస్, జీ.రామారావు, సురేంద్ర, జి.బి.బాబు, తిరుమల రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Arattai